అనామ‌కుడు టూ అసాధ్యుడు..

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇలాంటి ఇంట్రో అయితేనే స‌రిపోతుందేమో..? అస‌లు ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ఈ కుర్ర హీరో. ఎవ‌రి స‌పోర్ట్ కూడా పెద్ద‌గా లేదు. పెళ్లిచూపులు సినిమా టైమ్ లో దాన్ని విడుద‌ల చేయ‌డానికే నానా తంటాలు ప‌డ్డాడు. ఇప్పుడు ఈయ‌న సినిమా చేస్తుంటే మేం విడుద‌ల చేస్తాం అంటే లేదు మేం చేస్తామంటూ ఈయ‌న వెంట ప‌డుతున్నారు నిర్మాత‌లు. చాలా సైలెంట్ గా వ‌చ్చిన ఈ కుర్రాడు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయాడు. పెళ్లిచూపులు సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డితో అరాచ‌కాలే చేసాడు. ఈ చిత్రం 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దాంతో చిన్న నిర్మాత‌ల‌కు విజ‌య్ వ‌రంగా మారాడు. నాని ఈ రేంజ్ నుంచి స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు విజ‌య్ ఇదే దారిలో న‌డుస్తున్నాడు.

విజయ్ డేట్స్ కోసం ఇండ‌స్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే గీతాఆర్ట్స్ లో వ‌ర‌స‌గా రెండు సినిమాలు చేస్తున్నాడు విజ‌య్. అల్లు అర‌వింద్ నిర్మాణంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తోన్న‌ సినిమా షూటింగ్ దాదాపు స‌గానికి పైగా పూర్తైంది. దీంతోపాటు త్రివిక్ర‌మ్ నిర్మాణంలో నందినిరెడ్డి ద‌ర్శ‌కురాలిగా మ‌రో సినిమా చేస్తున్నాడు. దాంతోపాటు భ‌ర‌త్ క‌మ్మ‌.. రాహుల్ సంకృత్యాయన్ అనే కొత్త ద‌ర్శ‌కుల‌తోనూ సినిమాల‌కు క‌మిట‌య్యాడు ఈ కుర్ర హీరో. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిట్ అయ్యాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు బాబీతో ఓ సినిమా చేయ‌బోతున్నాడని తెలుస్తుంది. ఇవ‌న్నీ గానీ హిట్టైతే విజ‌య్ దేవ‌ర‌కొండను ప‌ట్టుకోవ‌డం క‌ష్టం.

User Comments