రివ్యూ: వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లె, కేథరిన్ థెరిస్సా, ప్రియదర్శి, విష్ణు తదితరులు

సాంకేతికవర్గం: సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, సమర్పణ: కె.ఎస్.రామారావు, రచన, దర్శకత్వం: క్రాంతిమాధవ్.

విడుదల: 14 ఫిబ్రవరి 2020

సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్

ముందుమాట

ప్రేమకథలకి పెట్టింది పేరు విజయ్ దేవరకొండ. అయితే ఆయన ప్రేమకథలు కాస్త ప్రత్యేకం. బోల్డ్గా ఉంటాయి. `అర్జున్రెడ్డి` నుంచి ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఆ ఇమేజ్కి తగ్గట్టుగా కథల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. `వరల్డ్ ఫేమస్ లవర్` అంటూ పేరు ప్రకటించగానే అది విజయ్ మార్క్ అనిపించుకుంది. అందరి దృష్టి ఆ సినిమాపై మళ్లింది. ఇది నా చివరి ప్రేమకథ కావొచ్చంటూ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించారు విజయ్. సున్నితమైన చిత్రాల్ని తీసే క్రాంతిమాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విజయ్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తారు. మరి సినిమాలో ముగ్గురు ప్రేమికులు ఉన్నారా? ఆ పాత్రల్లో విజయ్ ఎలా ఒదిగిపోయాడు? గత సినిమాతో పరాజయాన్ని చవిచూసిన ఆయన ఈ చిత్రంతో సక్సెస్ని అందుకున్నట్టేనా? తదితర విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ

గౌతమ్ (విజయ్ దేవరకొండ) రచయితగా ఎదిగే ప్రయత్నంలో ఉంటాడు. యామిని (రాశిఖన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమెతో సహజీవనం చేస్తాడు. కెరీర్ పరంగా సమస్యల్ని ఎదుర్కుంటున్న గౌతమ్ ప్రేమబంధానికి బీటలువారుతుంది. యామినితో బ్రేకప్ అవుతుంది. ఆ ఆవేశంలోనే బొగ్గు గని కార్మికుడైన శీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్) జంట కథని రాయడం మొదలుపెడతాడు. శీనయ్యకి సువర్ణ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్లిద్దరి మధ్యకి స్మిత (కేథరిన్ ) వస్తుంది. స్మిత ఎవరు? ఆమె వచ్చాక ఆ ఇద్దరి కథలో ఏం జరిగింది? గౌతమ్ రాసిన ఈజా (ఈసాబెల్లె)తో ప్రేమకథ ఎలాంటిది? అసలు గౌతమ్, యామిని బంధం ఎలా మొదలైంది? బ్రేకప్ తర్వాత వాళ్లిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి? గౌతమ్ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ప్రేమకథలకి కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో… భావోద్వేగాలు అంతే ముఖ్యం. మొదట్నుంచి భావోద్వేగాలపై మంచి పట్టుని ప్రదర్శిస్తున్న క్రాంతిమాధవ్ మరోసారి తన మార్క్ కథ, కథనాలతోనే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మూడు ప్రేమకథలుంటే… ప్రతి కథలోనూ భావోద్వేగాల్ని పండించేందుకు ప్రయత్నించాడు. అయితే సినిమాకి ప్రధానమైన గౌతమ్, యామిని కథలో కాకుండా… శీనయ్య, సువర్ణల కథలో మాత్రమే ఆశించిన స్థాయి భావోద్వేగాలు పండాయి. మిగతా కథల్లో చెప్పుకోదగ్గ కొత్తదనం కానీ, భావోద్వేగాలు కానీ పండలేదు. విజయ్… నలుగురమ్మాయిలు అనగానే అసలు ఈ నాలుగు ప్రేమకథలకి సంబంధమేమిటనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. కానీ ఆ కథల్ని మేళవించిన విధానం ప్రేక్షకుల్లో అసంతృప్తిని కలిగిస్తుంది. గౌతమ్, యామిని కథ మినహా… అన్నీ కూడా కథానాయకుడు ఊహించుకునే కథలే. స్వతహాగా తనొక రచయిత కాబట్టి, అన్నీ కూడా తాను రాసుకునే కథలే. ప్రేక్షకుడికి నిజం కాని కథ, కల్పితనమైన కథ అని తెలిసినప్పుడు వాటికి అంతగా కనెక్ట్ కాలేడు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఇక సినిమాకి మూల కథైనా గౌతమ్, యామినిల ప్రేమకథలో కూడా ఏమాత్రం బలం లేదు. ప్రతి కథలోనూ నిజాయతీ కనిపిస్తుంది. కానీ అవి ప్రేక్షకుడిని హత్తుకోలేవు. అదే ఈ సినిమాకి మైనస్. అయితే పతాక సన్నివేశాలు కూడా సాదాసీదాగా సాగుతాయి. కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా శీనయ్య, సువర్ణల ప్రేమకథ ఇందులో ఉన్నప్పటికీ… వాళ్లని సినిమాకి రావద్దనిపించే స్థాయిలో మిగిలిన రెండు కథలు ఉంటాయి. మంచి సున్నితమైన కథల్ని అంతే పద్ధతిగా తీసి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతిమాధవ్ ఈ సినిమాతో రెచ్చిపోయాడు. విజయ్ సినిమా కదా అనుకున్నాడో ఏమో, శ్రుతిమించిన బోల్డ్ సన్నివేశాల్ని జోడించాడు. మాటలు కూడా శ్రుతిమించినట్టు అనిపిస్తాయి. వరల్డ్ ఫేమస్ లవర్ బుక్ రాయడం, అది విజయవంతం కావడంలాంటి సన్నివేశాల్ని సహజంగా, ఆకట్టుకునేలా తీయలేకపోయాడు దర్శకుడు.

నటీనటులు.. సాంకేతికత

విజయ్ దేవరకొండ నటన సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. ఆయన మూడు రకాల పాత్రల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా బొగ్గుగనిలో శీనయ్య పాత్రలో ఒదిగిపోయాడు. అదే ఎపిసోడ్లోనే కనిపించే ఐశ్వర్య రాజేష్ కూడా మనసుల్ని దోచేసింది. రాశిఖన్నా పాత్ర ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తుంటుంది. కొన్నిచోట్ల ఆమెతో కాస్త అతిగా నటింపజేసిన అనుభూతి కలుగుతుంది. కేథరిన్ పాత్రకి ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఈసాబెల్లే పాత్రైనా ద్వితీయార్థంలో కీలకంగా కనిపిస్తుంది. ఇక సాంకేతికంగా సినిమా ఆకట్టుకుంటుంది. సంగీతం అంతంతమాత్రమే అయినా… మిగతా విభాగాలు మంచి పనితీరునే కనబరిచాయి. దర్శకుడు క్రాంతిమాధవ్ రచయితగా మరోసారి తన ప్రత్యేకతని ప్రదర్శించాడు. అయితే దర్శకుడిగా మరింత పరిణతితో ఈసినిమాని తీర్చిదిద్దలేకపోయాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా, క్రియేటివ్ కమర్షియల్స్ స్థాయిలో ఉంటాయి.

రేటింగ్: 2.75/5

ఫైనల్గా: గల్లీ స్థాయి లవరే