మెర్స‌ల్.. రికార్డుల ఘ‌ల్ ఘ‌ల్.. 

తెలుగులో ఇమేజ్ కోసం పాకులాడుతున్న విజ‌య్ కు తమిళ‌నాట మాత్రం ప్రాణ‌మిచ్చే అభిమానులున్నారు. ర‌జినీకాంత్ త‌ర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు విజ‌య్. ఈయ‌న సినిమా వ‌చ్చిందంటే చాలు అభిమానులు పండ‌గ చేసుకుంటారు. ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. అదే మెర్స‌ల్. విడుద‌లైన 24 గంట‌ల్లో 1 కోటి 30 ల‌క్ష‌ల వ్యూస్ తో ఇండియాలో మ‌రే సినిమాకు సాధ్యం కాని రికార్డ్ సెట్ చేసాడు విజ‌య్. ఈ చిత్రం లైకులు కూడా ఒక్క‌రోజులో 7 ల‌క్ష‌ల 64 వేల సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు విజ‌య్.
ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సూప‌ర్ స్టార్ కు కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. ర‌జినీకాంత్ క‌బాలి.. అజిత్ వివేగం టీజ‌ర్స్ రికార్డుల్ని కేవ‌లం 9 గంట‌ల్లోనే తుడిచి పెట్టేసింది మెర్స‌ల్.
తెరీ త‌ర్వాత విజ‌య్ తో అట్లీకుమార్ తెర‌కెక్కిస్తోన్న సినిమా మెర్స‌ల్. తెరీ టైమ్ లో మేకింగ్ న‌చ్చి మ‌రోసారి అత‌డితో వ‌ర్క్ చేస్తున్నాడు విజ‌య్.
మెర్స‌ల్ షూటింగ్ పూర్తైపోయింది. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ విదేశాల్లో సేద తీరుతున్నాడు. ఇందులో స‌మంత‌, కాజ‌ల్, నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విజ‌య్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు మెర్స‌ల్ లో. ఊరుపెద్ద‌గా.. పొలిటీషియ‌న్ గా.. మెజీషియ‌న్ గా మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు విజ‌య్. ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించ‌డం విశేషం. అంతేకాదు.. ఈ చిత్రం కోసం హై రేంజ్ టెక్నిక‌ల్ టీం వాడుకుంటున్నాడు అట్లీ. 100 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం విజ‌య్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలవ‌నుంది. అక్టోబ‌ర్ 18న దీవాళి కానుక‌గా సినిమా విడుద‌ల కానుంది. తెలుగులో అదిరింది పేరుతో రానుంది మెర్స‌ల్.