విక్రమ్ ఏం మాయ చేస్తున్నాడో మరి..?

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కలిసి రావ‌ట్లేదు.. పేరు తెచ్చిన ప్ర‌యోగాలు బెడిసికొట్టాయి.. మాస్ సినిమాలు హ్యాండిచ్చాయి. ఇలాంటి టైమ్ లో ఎలాంటి సినిమా చేయాలో తెలియ‌క తెగ హైరానా ప‌డిపోయాడు విక్ర‌మ్. చివ‌రికి ఎలాగోలా ధైర్యం చేసి.. త‌న‌కు అచ్చొచ్చిన దారిలోనే వెళ్తున్నాడు ఈ హీరో. మ‌రోసారి ప్ర‌యోగాల బాట‌లోనే న‌డుస్తున్నాడు.

శంక‌ర్ తో చేసిన ప్ర‌యోగం ఐ దారుణంగా బెడిసి కొట్టినా.. మ‌ళ్లీ ఈ మ‌ధ్య ఇరుముగ‌న్ అనే మ‌రో ప్ర‌యోగంతో వ‌చ్చాడు విక్ర‌మ్. ఆనంద్ శంక‌ర్ చేసిన ఈ చిత్రం యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇందులో హీరో క‌మ్ విల‌న్ గా దుమ్ము లేపేసాడు విక్ర‌మ్. ఇక ప్ర‌స్తుతం న‌టిస్తోన్న స్కెచ్ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జ‌రుగుతుంది.

ఫ్లాపులు విక్ర‌మ్ కెరీర్ పై పెద్ద‌గా ప్ర‌భావం చూపిస్తున్న‌ట్లు క‌నిపించ‌ట్లేదు. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కిస్తోన్న స్కెచ్ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర బిజినెస్ 60 కోట్ల‌కు అటూ ఇటూగా జ‌రుగుతుంది. త‌మ‌న్నా ఇందులో హీరోయిన్. దాంతో పాటు గౌత‌మ్ మీన‌న్ ధృవ‌న‌క్ష‌త్రం సినిమాలోనూ న‌టిస్తున్నాడు విక్ర‌మ్. ఈ రెండూ సెట్స్ పై ఉండ‌గానే.. సామి సీక్వెల్ కు కూడా క‌మిట‌య్యాడు విక్ర‌మ్. 14 ఏళ్ల కింద హ‌రి చేసిన ఈ చిత్రం అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్. తెలుగులో దీన్నే ల‌క్ష్మీన‌ర‌సింహాగా రీమేక్ చేసాడు బాల‌య్య‌.

విక్ర‌మ్ కు ఇప్పుడున్న‌ ఇమేజ్ తో పోలిస్తే అప్ప‌టి సామి ఇప్పుడు క‌ష్ట‌మే. కానీ హ‌రి మాత్రం విక్ర‌మ్ పై చాలా న‌మ్మ‌కంగా క‌నిపిస్తున్నాడు. సామి 2తో ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తామ‌నే ధీమాతో ఉన్నాడు. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్ గా తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి ట్రాక్ రికార్డుల‌తో ప‌నిలేకుండా త‌న సినిమాల‌తో రికార్డులు సృష్టిస్తున్నాడు విక్ర‌మ్. చూడాలిక‌.. ఈ క్రేజ్ ఇంకెంత కాలం ఇలాగే కొన‌సాగుతుందో..?