విశాఖ మెట్రోతో భూములు చుక్క‌ల్లోకి

విశాఖలో మెట్రో రైల్ ప్ర‌క‌ట‌న భూముల ధ‌ర‌ల్ని చుక్క‌ల్లోకి తీసుకెళ్ల‌బోతోందా? అంటే అవున‌నే స‌మాచారం. గేమ్ తేదేపా నుంచి వైకాపా కోర్టులోకి వ‌చ్చాక జ‌గ‌న్- బొత్స -అవంతి శ్రీ‌నివాస్ బృందం వైజాగ్ అభివృద్ధిని ప‌రుగులు పెట్టించే ప్లాన్ లో ఉన్నార‌ని సంకేతం అందింది. ఇన్నాళ్లు న‌త్త‌న‌డ‌క‌న ఉన్న మెట్రో ప్రపోజ‌ల్ కి మ‌రోసారి ఊపొచ్చింది. తాజాగా 8300 కోట్ల వ్య‌యంతో మెట్రో నిర్మాణానికి సంబంధించిన కారిడార్ల మార్గాలను శనివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. గాజువాక, ఎన్‌ఎడీ, తాటిచెట్లపాలెం, ఆర్‌కే బీచ్‌ ప్రాంతాల్లో పర్యటించి.. కారిడార్‌ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

ఎనిమిది కారిడార్లుగా లైట్‌ మెట్రో ప్రాజెక్టుని అభివృద్ధి చెయ్యనున్నామని వెల్లడించారు. తొలి దశలో 3 కారిడార్లలో 46.42 కి.మీ. మేర ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ప్రభుత్వం సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోందని మంత్రి ముత్తంశెట్టి వివరించారు. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి ఈ విజిట్ ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ట‌. విశాఖ మెట్రోకి భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ క‌నెక్టివిటీని ప్ర‌తిపాదించ‌డంతో విశాఖ శివారుల్లోని భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లొస్తున్నాయ‌ని తెలుస్తోంది.