వైజాగ్‌లో ఫిలింఛాంబ‌ర్ ఆఫీస్‌

Last Updated on by

రాష్ట్రం రెండుగా విడిపోయాక న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌కు సినిమా ప‌రిశ్ర‌మ త‌ర‌లి వెల్లిపోతుంద‌ని భావించారంతా. సినీపెద్ద‌ల‌పై తేరాస ప్ర‌భుత్వం దాడులు ఆక‌స్మికంగా ఆగిపోవ‌డంతో అటుపై ప‌రిశ్ర‌మ పెద్ద‌లు మిన్న‌కుండిపోయారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఏపీలో నంది అవార్డులు ప్ర‌క‌టించిన వేళ‌.. అలానే ప‌రిశ్ర‌మ వివాదాలు అంత‌కంత‌కు పెద్ద‌వి అవుతున్న వేళ‌.. మ‌రోసారి సినీప‌రిశ్ర‌మ త‌ర‌లింపుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే కొత్త ప‌రిశ్ర‌మ‌ను స్థాపించాల్సి వ‌స్తే ఎక్క‌డ పెట్టాలి? అన్న‌దానిపైనా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంది. కొంద‌రు రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తి ప‌రిస‌రాల్లోనే కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు ఉంటుంద‌ని అంటున్నారు. మెజారిటీ పార్ట్ సినీపెద్ద‌లు వైజాగ్‌కే అవ‌కాశం ఉంద‌ని, ఆ మేర‌కు ఇప్ప‌టికే ప‌లు యాక్టివిటీస్‌ని ప్రారంభించార‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర‌నిర్మాత కె.ఎస్‌.రామారావు అధ్య‌క్ష‌త‌న ఫిలింన‌గ‌ర్ క్ల‌బ్ ఒక‌టి విశాఖ రామానాయుడు స్టూడియో ప‌రిస‌రాల్లో ఏర్పాటు అయ్యింది. బీచ్ ప‌రిస‌రంలో సువిశాల‌మైన ఈ ఆఫీస్ చూడ‌గానే ముచ్చ‌ట‌గొల‌ప‌డంతో ప‌రిశ్ర‌మ‌కు అనువైన ప్లేస్ ఇదేన‌న్న ప్ర‌శంస‌లు అప్ప‌ట్లో ఓపెనింగ్ వేళ వినిపించాయి. ఆ క్ర‌మంలోనే వైజాగ్ ఎఫ్ఎన్‌సీసీకి ఏపీ ప్ర‌భుత్వం 15ఎక‌రాలు ప్ర‌క‌టించింద‌న్న ప్ర‌చారం సాగింది. అదంతా అటుంచితే.. తాజాగా వైజాగ్ లో ఫిలింఛాంబ‌ర్ యాక్టివిటీస్ ప్రారంభ‌మ‌వ్వ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వైజాగ్ మిధిలాపురి ఉడా కాల‌నీలో ఎంవీవీ భ‌వ‌నంలో ఫిలింఛాంబ‌ర్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు.  సినీప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అన్ని విష‌యాల్ని హైద‌రాబాద్, విశాఖ నుంచి తెలుసుకోవ‌చ్చ‌ని న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ఎస్‌.వి.ఎన్‌.రావు తెలిపారు. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లి వెళ్ల‌క‌పోయినా ఏపీలో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటుపై సినీపెద్ద‌ల ఉత్సాహం ఇలా ప్ర‌తిసారీ బ‌హిరంగంగా తెలుస్తూనే ఉంది. మెజారిటీ పార్ట్ అంటే దాదాపు 85శాతం షూటింగులు వైజాగ్ కేంద్రంగానే జ‌రుగుతున్న నేప‌థ్యంలో విశాఖ ఫిలింన‌గ‌ర్ ఏర్పాటుపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోందిప్పుడు.

User Comments