విన‌య విధేయ రామ‌ మూవీ రివ్యూ

Last Updated on by

న‌టీన‌టులు: రామ్‌చ‌ర‌ణ్, కియ‌రా అద్వాణీ, వివేక్ ఒబేరాయ్, ముఖేష్ రిషి, ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్‌, స్నేహ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: బోయపాటి శ్రీ‌ను
నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌
బ్యాన‌ర్: డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
సంగీతం: దేవీశ్రీ ప్ర‌సాద్
జోన‌ర్‌: మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
రిలీజ్ తేదీ: 11-01-2018

సంక్రాంతి పుంజులు బ‌రిలో దిగాయి. నువ్వా నేనా అంటూ పోటీప‌డుతున్నాయి. ఈ వ‌రుస‌లో ఇప్ప‌టికే రెండు భారీ చిత్రాలు ఎంతో క్రేజీగా రిలీజ‌య్యాయి. జ‌న‌వ‌రి 11న మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `విన‌య విధేయ రామ‌` ఈ వ‌రుస‌లో మూడో సినిమాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత క్రేజీగా రిలీజైంది. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో డివివి దాన‌య్య నిర్మించిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమాపై టీజ‌ర్, పోస్ట‌ర్ ద‌శ నుంచే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. పండ‌క్కి ఈ చిత్రం పూర్తిగా మాస్ కి హై ఓల్టేజ్ యాక్ష‌న్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని ట్రైల‌ర్ తోనే ప్రూవైంది. అయితే ఈ సినిమాలో మ్యాట‌ర్ ఎంత‌? మెగా ఫ్యాన్స్ తో పాటు, మాస్ ఆడియెన్‌కి ఏ మేర‌కు కిక్కిచ్చింది? బాక్సాఫీస్ వ‌ద్ద విధేయ రాముని హ‌వా ఎంత వ‌ర‌కూ సాగుతుంది? అన్న‌ది తెలియాలంటే ఇదిగో ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

క‌థ‌:
కుటుంబం కోసం ఎంత‌కైనా తెగించే విన‌య విధేయ రాముని క‌థ ఇది. తాను ఎంత‌గానో ప్రేమించే అన్న‌లు వ‌దిన‌లు ఫ్యామిలీకి ఏదైనా అయితే త‌ట్టుకోలేని ఓ సామాన్య యువ‌కుడు రామ్ కొణిదెల‌(చ‌ర‌ణ్‌) త‌న అన్న‌న్ను చంపిన విల‌న్ (ఒబెరాయ్ బృందం)పై ప‌గ‌ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడ‌న్న‌దే క‌థాంశం. ఈ క‌థ‌లోనే కుటుంబ బంధాలు, అనుబంధాలు, కియ‌రాతో ప్రేమ‌క‌థ‌, బీహార్ మాఫియా నేప‌థ్యం.. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి రంగ ప్ర‌వేశంతో చెల్లా చెదురైన కుటుంబం.. గ్యాంగ్ వార్ వ‌గైరా తెరపై చూడాల్సిందే.

ఇక క‌థ‌నంలోకి వెళితే.. ఒక రైల్ ట్రాక్ వ‌ద్ద ప‌డి ఉన్న ఓ ప‌సికందును న‌లుగురు అనాధ‌లైన అన్నద‌మ్ములు చేర‌దీసి పెంచుకుంటారు. చ‌ల‌ప‌తిరావు వీళ్ల‌కు గార్డియ‌న్. ఆ క్ర‌మంలోనే అన్న‌ద‌మ్ములంతా పెరిగి పెద్ద వాళ్ల‌యి బాధ్య‌తాయుత‌మైన ఉద్యోగాల్లో సెటిల‌వుతారు. అంద‌రిలో చిన్న‌వాడైన రామ్ కొణిదెల త‌ప్ప అంద‌రూ సంఘంలో గౌర‌వ‌మైన జీవితాన్ని కొన‌సాగిస్తుంటారు. అన్న ప్ర‌శాంత్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్. వృత్తి బాధ్య‌తలో ఎంత‌కైనా ఎదురెళ్లే త‌త్వం ఉన్న‌వాడు. ఆ క్ర‌మంలోనే విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా విల‌న్ ముఖేష్ రిషీకి ప్ర‌శాంత్ ఎదురెళ్లాల్సి వ‌స్తుంది. ఒకానొక టైమ్ లో అన్న కోసం రామ్ బ‌రిలో దిగి ఫైట్ చేస్తాడు. ముఖేష్ బెదిరింపుల‌కు లొంగ‌ని రామ్ .. నువ్వా నేనా? అన్న ప్రెస్టేజ్ ఇష్యూలో రామ్ కొ.ణి.దె.ల అంటూ ఫైర్ బ్రాండ్ స్టైల్లో ఎదురెళ‌తాడు. అన్న‌లు, వ‌దిన‌లు కుటుంబంతో ప్ర‌శాంతంగా వెళుతున్న జీవితాల్లో విల‌న్ ముఖేష్‌, ఎంట్రీ ఓ పెద్ద కుదుపు. ఆ క్ర‌మంలోనే అన్న ప్ర‌శాంత్ విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా బీహార్‌కి షిఫ్ట‌వుతాడు. అక్క‌డ ఎదుర‌వుతాడు అస‌లైన కాల‌ య‌ముడు వివేక్ ఒబెరాయ్. త‌న క‌నుస‌న్నల్లో ఒక సామ్రాజ్యాన్నే శాసించే భీక‌రుడైన ఒబెరాయ్ ని ఎన్నిక‌ల అధికారి అయిన‌ ప్ర‌శాంత్ అత‌డి అరాచ‌కాల్ని వ్య‌తిరేకించాల్సి వ‌స్తుంది. దీంతో ఒబెరాయ్‌ ప్ర‌శాంత్‌ని చంపేస్తాడు. కుటుంబాన్ని బంధిస్తాడు. భయంక‌రుడైన విల‌న్ ఒబెరాయ్ నుంచి త‌న కుటుంబాన్ని ర‌క్షించుకునేందుకు రామ్ కొణిదెల ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌దే బ్యాలెన్స్ స్టోరి. ఈ క‌థ‌లోనే కియ‌రాతో పెళ్లి చూపులు, ప్రేమ‌క‌థ వ‌గైరా తెర‌పై చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌
చ‌ర‌ణ్ న‌ట‌న ప్ల‌స్. మ్యాకోమ్యాన్ లుక్ లో రామ్ చ‌ర‌ణ్ మాస్‌కి భారీ యాక్ష‌న్ ట్రీట్ ఇచ్చాడు. అత‌డి న‌ట‌న‌, ఆహార్యం పెద్ద ప్ల‌స్. అలాగే ఈ చిత్రంలో సెంటిమెంట్, కుటుంబ బంధాలు ఆక‌ట్టుకుంటాయి. అన్న చ‌నిపోయినా ఆ బాధను దిగ‌మింగుకుని ఇంట్లో తెలియ‌కుండా మ్యానేజ్ చేసేందుకు చ‌ర‌ణ్ ప‌డే ఆవేద‌న ఆక‌ట్టుకుంటుంది. ఒబెరాయ్ భీక‌ర‌మైన విల‌నీ పెద్ద ప్ల‌స్. ఇత‌ర పాత్ర‌ల్లో ఎవ‌రికి వారు ఒదిగిపోయారు. 30 ఇయ‌ర్స్ పృథ్వీ, హేమ కామెడీ ఆక‌ట్టుకుంది. ఎన్నిక‌ల అధికారిక‌గా ప్ర‌శాంత్ న‌ట‌న ప్ల‌స్. ఆర్య‌న్ రాజేష్‌, ముఖేష్ రుషి పాత్ర‌లో త‌మ ప‌రిధి మేర ప్ర‌వ‌ర్తిస్తాయి. స‌రైనోడు త‌ర‌హా ఇంట‌ర్వెల్ బ్యాంగ్, ఏక్ బార్ సాంగ్ హైలైట్. ఇక బోయ‌పాటి మార్క్ డైలాగులు కొన్ని మాస్ కి ట్రీటిస్తాయి. ఇక కియరా గ్లామ‌ర్ మాస్ కి ఓ ట్రీట్. త‌న పాత్ర‌కు అంత వెయిట్ లేదు.

మైన‌స్ పాయింట్స్‌
జ‌నం ముందే గెస్ చేయ‌గ‌లిగే రొటీన్ క‌థ‌, క‌థ‌నం పెద్ద మైన‌స్. సెకండాఫ్ లో భారీ యాక్ష‌న్ సీక్వెన్సుల్లో అస‌హ‌జ‌త్వం మైన‌స్. శ్రుతి మించిన హింస‌, యాక్ష‌న్ ఫ్యామిలీ ఆడియెన్ కి క‌నెక్ట‌వ్వ‌డం క‌ష్ట‌మే. యాక్ష‌న్‌ ఎక్క‌డా నేచుర‌ల్ వేలో ఉన్న‌ట్టు క‌నిపించ‌దు.

సాంకేతిక వ‌ర్గం
టెక్నిక‌ల్ గా హై స్టాండార్డ్స్ ఉన్న విజువల్ రిచ్ చిత్ర‌మిది. దాన‌య్య ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌ను వేలెట్టి చూప‌లేరు. కెమెరా వ‌ర్క్, సంగీతం వ‌గైరా వ‌గైరా సినిమాకి పెద్ద ప్ల‌స్. పిల్ల‌లు ఆడుకునే వీడియో గేమ్ లా ద్వితీయార్థం పెద్ద మైన‌స్. కేవ‌లం యాక్ష‌న్ స‌న్నివేశాలు, భారీ పంచ్ డైలాగ్స్ తో ట్రీటివ్వాల‌నే త‌ప‌న నుంచి బోయ‌పాటి ఇక‌నైనా బ‌య‌ట‌ప‌డి క‌థ‌పై శ్ర‌ద్ధ పెట్టాల‌ని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఎంచుకున్న‌ క‌థ విష‌యంలో ఈసారి చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు.

చివ‌ర‌గా:
`విన‌య విధేయ రామ` ఓన్లీ మాస్ ట్రీట్! చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కోసం మాత్ర‌మే..

రేటింగ్‌:
2.5/ 5.0

Poll: Which movie will collect more on Pongal Box Office

Also Read: VVR Slow Start Near US Box Office

 

User Comments