విజయ్ సినిమా పేరు `ఎక్స్.వై.జడ్` అయితే?

మరి కొన్ని గంటల్లోనే `వరల్డ్ ఫేమస్ లవర్`గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ప్రమోషన్ వ్యవహారాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. తన మార్క్ క్యాంపెయినింగ్స్ చేస్తూ కుర్రాళ్లని ఊరిస్తున్నాడు. సినిమాకున్న బజ్… విజయ్కున్న క్రేజ్కైతే తిరుగులేదు కానీ ఆయనలో ఏదో మూల కాస్త ఒత్తిడి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత చిత్రం `డియర్ కామ్రేడ్` ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. అందుకే ఈచిత్ర విజయం ఆయనకి కీలకం. పాన్ ఇండియా రేంజ్లో దున్నేయాలని చూస్తున్న విజయ్కి ఇకపై ప్రతి సినిమా ఒక అగ్నిపరీక్షే అని చెప్పొచ్చు.

అయితే తనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం అస్సలు తగ్గలేదు. `వరల్డ్ ఫేమస్ లవర్` టైటిల్ గురించి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం వింటే మాత్రం రౌడీ సర్… రౌడీ అంతే అనాలనిపిస్తుంది. “అవును నిజమే. మేం ముందు ఈ సినిమాకి.. ప్రియం, ముంబై తీరం తదితర పేర్లు అనుకున్నాం. కానీ అవి మరీ పాతగా ఉన్నాయని వద్దనుకున్నాం. `వరల్డ్ ఫేమస్ లవర్` అని పక్కా చేసినం. కథలో నుంచి వచ్చిన టైటిలే అది. అయినా సినిమాలకి టైటిల్వల్ల తేడా ఏం ఉండదు. `ఎక్స్.వై.జడ్` అని పెట్టినా ఓకే అనేస్తారు ప్రేక్షకులు. నా సినిమా విడుదలంటే అడ్వాన్స్గా టికెట్లు బుక్ అయిపోతున్నాయి. అది చాలు కదా“ అని చెప్పుకొచ్చాడు విజయ్. నిజంగా విజయ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్ కదా.