మహేష్ కాంపౌండ్లో ఏం జరుగుతోంది?

తిరిగొచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న సినిమా కోసం రంగంలోకి దిగుతానని ఫారిన్ టూర్ కోసం ఫ్లైటెక్కేశాడు మహేష్. `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో వచ్చిన విజయాన్ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుని ఇటీవలే వచ్చేశాడు. ఇక రంగంలోకి దిగుతారని అంతా అనుకుంటున్న దశలోనే ఆ కలయికలో సినిమా గురించి రకరకాల పుకార్లు బయటికొచ్చాయి. మహేష్ -వంశీ పైడిపల్లి కలయికలో సినిమా ఆగిపోయిందని, మరో దర్శకుడు చెప్పిన కథకి ఓకే చెప్పేశాడనే గుసగుసలు రెండు రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఆ దర్శకుడు ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్.

అతనెవరా అని మీడియా ఆరా తీస్తున్న క్రమంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పరుశురామ్ దర్శకత్వంలోనే మహేష్ తదుపరి సినిమా చేయబోతున్నాడనేదే ఆ విషయం. కొన్నాళ్ల కిందటే మహేష్కి పరశురామ్ కథ చెప్పాడు. అప్పుడు నచ్చలేదని, కొన్ని మార్పులు చెప్పాడని ప్రచారం జరిగింది. దాంతో పరశురామ్ కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటూ నాగచైతన్య దగ్గరికొచ్చేశాడు. కానీ ఇప్పుడు మహేష్ తదుపరి సినిమా చేయబోయేది పరశురామే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అసలు మహేష్ కాంపౌండ్లో ఏం జరుగుతోంది? వంశీ పైడిపల్లి ఎప్పట్నుంచో తయారు చేసుకుంటున్న కథ విషయంలో వచ్చిన సమస్య ఏమిటనేదే ఇప్పుడు అంతుచిక్కడం లేదు. మహేష్ అండ్ కో క్లారిటీ ఇస్తే తప్ప ఈ పుకార్లకి పుల్స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదు.