పూరిలో ఇంత మార్పు ఎలా?

Puri Jagannadh( File Photo)

కాలంతో పాటే మార్పు. ఈ విష‌యంలో స్టార్ డైరెక్ట‌ర్ పూరి అతీతుడేం కాదు. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రికో ఉపాధినిచ్చిన పూరి .. ఇటీవ‌ల దాన‌ధ‌ర్మాలు చేస్తూ ప‌లువురికి సాయం చేస్తూ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. అందుకే ఒక‌ప్ప‌టి పూరి వేరు…నేటి పూరి వేరు అన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు పూరి అంద‌రికీ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఈ మార్పున‌కు కార‌ణ‌మేంటి? అన్న‌ది అంద‌రిలో సందేహం. అవ‌కాశాలు లేక ఆర్ధికంగా ఇబ్బంది ప‌డుతోన్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల క‌ష్టాల‌ను గుర్తించి ఇటీవ‌ల‌ ఓ 30 మందికి త‌లో 50 వేల రూపాయ‌లు చొప్పున  15 ల‌క్ష‌లు సాయ‌మందించాడు. త‌ను బాగుంటే ప్ర‌తి ఏడాది ఇలాగే  ఎంతో కొంత మందిని ఆదుకుంటాన‌ని ప్రామిస్ చేసాడు. ప్ర‌తీ ఏడాది త‌న పుట్టిన రోజు ఇలాగే సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చాడు. తాజాగా పునాది రాళ్లు ద‌ర్శ‌కుడు గూడ‌పాటి రాజ‌కుమార్ అనారోగ్యం బారిన ప‌డ‌టంతో పూరి 50 వేలు సాయం చేసి త‌న దాతృ హృద‌యాన్ని చాటుకున్నాడు.

కాలంతో పాటే వ‌చ్చిన మార్పు ఇది. ఒక‌ప్పుడు స‌హాయం అనే మాట ఎత్తితేజ..  నేనెందుకు చేయాలి?   నాబ్ర‌తుకు నాది… నా క‌ష్టం నాది అనేవాడు పూరి. “ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించి ఈస్థాయికి చేరుకున్నాను. క‌ష్టం విలువ ప్ర‌తీ ఒక్కరికీ తెలియాలి!!“ అని ముక్కు సూటిగా మాట్లాడేవాడు. అయినా నా మీద‌నే ఆధార‌ప‌డి సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ఎన్నో కుటుంబాలు బ్ర‌తుకుతున్నాయ‌ని చెప్పేవాడు. తాను క‌థ రాసి హీరోని  మెప్పించి సినిమా చేస్తే దాంతో మరికొంత మందికి ప‌ని దొరికేది. 24 శాఖ‌లకు  డైరెక్ట‌ర్-హీరో ఉంటేనే ప‌ని దొరుకుతుంది. ఆ విధంగా పూరి ఎన్నో కుటుంబాల‌ను ఉఫాదిని క‌ల్పించేవాడిన‌ని చాలా ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చాడు. అయితే గ‌త రెండేళ్ల‌గా ఆయ‌న స్వ‌రం మారిన‌ట్లు అనిపిస్తోంది. పాత ధోర‌ణిని ప‌క్క‌కు పెట్టి వీలైతే స‌హాయం చేసే గుణాన్ని అల‌వాటు చేసుకున్నాడు. సాయం ప్లీజ్‌! అంటూ వెళ్లిన వారిని ఆదుకుంటున్నాడు. న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ ఆహ్వానంతో  `మ‌నం సైతం` కార్య‌క్ర‌మం ద్వారా బాధిత కుటుంబాల కోసం ఫిలిం ఛాంబ‌ర్ కి వ‌చ్చి చెక్ లు అందిస్తున్నాడు. ఆ స‌మ‌యంలో  త‌న వ్య‌క్తిగ‌త విరాళ్లాన్ని ప్ర‌క‌టిస్తున్నాడు. మ‌రి ఒక్క‌సారిగా  పూరిలో ఈ మార్పు ఏమిటో అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆర్జీవీ మార్క్ ఆలోచ‌న‌లు త‌న‌ని వ‌ద‌ల‌డం వ‌ల్ల‌నే ఈ మార్పునా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు కొంద‌రైతే!!