మంచు హీరోలేమ‌య్యారు?

గ‌త కొంత‌కాలంగా మంచు కుటుంబ హీరోలు ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. మంచు విష్ణు, మంచు మ‌నోజ్ ఈ ఇద్ద‌రూ ప్ర‌తిభావంతులుగా నిరూపించుకున్నారు. కెరీర్‌లో కొన్ని హిట్లు, బంప‌ర్ హిట్లు అందుకున్నారు. అయితే ఇటీవ‌ల ఏమైందో ఆ ఇద్ద‌రికీ బ్యాడ్ ఫేజ్ ర‌న్ అవుతోంద‌నే అర్థ‌మ‌వుతోంది. కొన్ని వ‌ర‌స వైఫ‌ల్యాలు ఈ యంగ్ హీరోల కెరీర్‌ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. వ‌రుస‌గా సినిమాలు చేసినా అవేవీ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగానే ఉంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

మంచు విష్ణు న‌టించిన ఓట‌రు అనే చిత్రం ఏమైందో.. అస‌లు దానికి సంబంధించిన అప్‌డేట్ ఇంత‌వ‌ర‌కూ రాలేదు. క‌న్న‌ప్ప అనే వేరొక చిత్రానికి సంబంధించిన చ‌ర్చ సాగినా దానికి సంబంధించిన అప్‌డేట్ కూడా లేనేలేదు. ఇక మంచు మ‌నోజ్ స‌న్నివేశం వేరుగా ఉంది. అత‌డు గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా పూర్తి నిరాశ‌లో ఉన్నాడ‌ని చ‌ర్చ సాగింది. ఇదివ‌ర‌కూ అస‌లు హీరోగా న‌టించ‌న‌ని, ఇక సినిమాలు విర‌మించుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించి అభిమానుల‌కు షాకిచ్చాడు. అయితే ఆ త‌ర్వాత మోహ‌న్‌బాబు స‌ముదాయించ‌డంతో తిరిగి న‌టిస్తాన‌ని మ‌రో ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించాడు. అయినా ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు న‌టిస్తున్న సినిమా వివ‌రం బ‌య‌ట‌కు రాలేదు. ఒక్క‌డు మిగిలాడు త‌ర్వాత మ‌నోజ్ సినిమాలేవీ రాలేదు. అయితే కొత్త సంవ‌త్స‌రంలో కొత్త సినిమాకి శ్రీ‌కారం చుడ‌తాడ‌న్న మాటా వినిపిస్తోంది. త‌న తండ్రి మోహ‌న్‌బాబు పుట్టిన‌రోజున అంటే మార్చి 19న కొత్త సినిమా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. గ‌తంలో చందు అనే ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చార‌మైంది. అత‌డిని తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడా.. లేదా కొత్త ప్రాజెక్టు లో న‌టిస్తాడా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇక‌పోతే మంచు ల‌క్ష్మీ మాత్రం కెరీర్ ప‌రంగా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం జ్యోతిక న‌టిస్తున్న ఓ త‌మిళ్ – తెలుగు ద్విభాషా చిత్రంలో లక్ష్మీ ప్ర‌స‌న్న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.