టాప్ స్టోరి: ప‌నికి రాని టాలీవుడ్‌!

Last Updated on by

అంత‌ర్జాతీయ ఫిలింఫెస్ట్‌కు తెలుగు సినిమా ప‌నికి రాదు అని డైరెక్టుగా మ‌న ఫిలింమేక‌ర్సే చెబుతుంటారు. ఇక్క‌డ ఓన్లీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్ర‌మే తీస్తార‌ని, ఇవి సినిమా పండుగ‌ల్లో ప్ర‌దర్శ‌న‌కు అర్హ‌త సాధించ‌లేవ‌ని చెబుతుంటారు. ఇదే విష‌యంపై అనుభ‌వ‌జ్ఞులు ప‌లుర‌కాలుగా విశ్లేషించారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ కేవ‌లం డ‌బ్బు కోస‌మే ప‌ని చేస్తుంద‌ని, ఇక్కడ మేక‌ర్స్‌కి ఎయిమ్ అనేది ఉండ‌ద‌ని విమ‌ర్శించిన సంద‌ర్భాలున్నాయి. అయితే తెలుగు సినిమాకి ఈ ఝాడ్యం ప‌ట్ట‌డానికి కార‌ణం ఫిలింఛాంబ‌ర్‌, నిర్మాత‌ల మండ‌లి ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మేన‌ని ఓ కుర్ర‌హీరో అన‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కొచ్చింది.

ఓ ర‌కంగా కేన్స్ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల‌కు చివ‌ర‌కు ఒడియా సినిమా అయినా వెళుతోంది కానీ, మ‌న తెలుగు సినిమా వెళ్ల‌నే వెళ్ల‌దు. అరుదుగా బాహుబ‌లి లాంటి చిత్రాల‌కు ప్ర‌చారం కోసం రాజ‌మౌళి బృందం తీసుకెళ్లింది త‌ప్పితే, చిత్త‌శుద్ధితో మ‌న సినిమాకి విమ‌ర్శ‌కుల గుర్తింపు రావాల‌న్న ప్ర‌య‌త్నం అయితే సాగలేద‌ని తేలిపోయింది. ఇక కేన్స్ స‌హా ప్ర‌పంచవ్యాప్తంగా ఎన్నో అంత‌ర్జాతీయ సినిమా పండుగ‌లు సాగుతున్నాయి. కానీ ఎక్క‌డా తెలుగు సినిమా జాడ అన్న‌దే క‌నిపించ‌దు. ఒక్క‌రు కూడా అలాంటి కంటెంట్‌తో సినిమా తీసే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డంపైనా ఇక్క‌డ ఏమంత సీరియ‌స్‌నెస్ లేద‌న్న‌ది ఒక కోణం. ఇటీవ‌లే జ‌రిగిన కేన్స్ ఉత్స‌వాల‌కు ఇరుగు పొరుగు సినిమాల్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు పంపారు కానీ అస్స‌లు టాలీవుడ్ నుంచి ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా వెళ్ల‌లేదు. కేన్స్ అంటే అదేమీ పెద్దంత భ‌య‌ప‌డిపోయేదేం కాదు. అస‌లు మ‌న‌వాళ్లు అందుకు ఆస‌క్తి అన్న‌దే చూపరు… అని చెబుతున్నారు. అయితే ఈ స‌న్నివేశం మారేందుకు తెలుగు ఫిలింఛాంబ‌ర్‌, నిర్మాత‌ల మండ‌లి ఏదైనా చ‌ర్చ చేప‌డుతుందేమో చూడాలి. ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమా మారుతోంది. ఈ ఏడాది కాలంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కే సినిమాల్ని మ‌న‌వాళ్లు తీస్తున్నారు. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను లాంటి చిత్రాలు విల‌క్ష‌ణ ఫార్ములాతో క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ సాధించాయి. విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాయి. ఈ ఒర‌వ‌డిలో మ‌న సినిమాని అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల‌కు పంపించాల్సి ఉంది.

User Comments