ఆహా… మనోళ్లకి ఆనుతుందా మరీ!

డిజిటల్ యుగం ఇది. ఓటీటీ ఛానళ్ల వల్ల జనాలు థియేటర్లకి కూడా వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కొత్త సినిమాల్ని ఇంట్లోనే చూసేస్తున్నారు. వాటిలో వస్తున్న వెబ్ సిరీస్‌లైతే సినిమాల్నిసైతం శాసించే స్థాయికి చేరాయి. అందుకే భవిష్యత్తంతా ఓటీటీదే అన్నమాటలు విరివిగా వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఓటీటీ ఛానల్స్‌ని ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపుతున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆవిషయంలో టాలీవుడ్ ఒక అడుగు ముందే ఉంది. అల్లు అరవింద్ తాజాగా మై హోమ్ గ్రూప్‌తో కలిసి ఆహా చానల్ని లాంచ్ చేశాడు. త్వరలోనే దిల్‌రాజు ఛానల్ కూడా రాబోతోంది. వీటితో కంటెంట్ పెరగడమే కాకుండా… నటీనటులు, సాంకేతిక నిపుణులకి అవకాశాలూ విరివిగా రాబోతున్నాయి.

కాకపోతే ఇల్లు అలగ్గానే పండగైపోదనీ, డిమాండ్ మేరకు కంటెంట్‌ని అందించగలరా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యేడాదికింత అని ముందే రుసుము చెల్లించి ఓటీటీ సభ్యత్వం తీసుకుంటారు. ఆహా ఛానల్ సభ్యత్వం యేడాదికి రూ: 365గా నిర్ణయించారు. అంత చెల్లిస్తున్నప్పుడు ప్రేక్షకులు కొత్త సినిమాలు, కొత్త షోలు విరివిగా చూడాలనుకుంటారు. మరి ఆ డిమాండ్ మేరకు వాళ్లకి ఆనేలా కంటెంట్‌ని ఛానల్లో పెట్టడం సాధ్యమయ్యే పనేనా అనేదే ఇప్పుడు సందేహం. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు కోట్లకి కోట్లుపోసి సినిమాల రైట్స్ తీసుకుంటూ చందాదారుల్నిఆకర్షిస్తున్నాయి. స్థానిక సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ సిరీస్‌లు కూడా పెద్దయెత్తున వాటిలో అందుబాటులో ఉంచుతుంటాయి. మరి ఆ రేంజ్లో మనోళ్లు కంటెంట్‌ని అందుబాటులోకి తీసుకురాగలరా? ఓన్లీ తెలుగు కంటెంట్ అంటున్న మనోళ్లు ప్రేక్షకులకు చందాల స్థాయిలో సంతృప్తినివ్వగలరా? ఇవి ఏ రేంజ్లో సక్సెస్ అవుతాయన్నవే ఇప్పుడు ప్రశ్నలు. కొత్త సినిమాల్ని కొనేందుకు అధికంగా పెట్టుబడి పెట్టడంతో పాటు… నాణ్యమైన కంటెంట్‌ని క్రియేట్ చేయడంలోనూ ముందున్నప్పుడే ఇవి సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయనేది సినీ వర్గాల మాట.