అఖిల్ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడా..?

అఖిల్ సినిమా అఖిల్ కు ఓ పీడ‌క‌ల‌. నిద్ర‌లో కూడా త‌లుచుకోరాని పీడ‌క‌ల‌. ఏ హీరోకైనా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం అఖిల్ కు విజ‌యం తీసుకురాక‌పోగా.. విమ‌ర్శ‌లు కూడా తీసుకొచ్చింది. దాంతో ఆ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా మర్చిపోవాల‌ని ట్రై చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇక నాగార్జున కూడా అఖిల్ ను తొలి సినిమా ఊహ‌ల్లోంచి బ‌య‌ట ప‌డేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌నే క‌సితో అఖిల్ రెండో సినిమా కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నాడు. ఇప్ప‌టికే పెద్ద కొడుకు నాగ‌చైత‌న్య‌కు రారండోయ్ వేడుక చూద్దాం రూపంలో హిట్టిచ్చాడు నాగార్జున‌. ఇక ఇప్పుడు చిన్న కొడుకుపై దృష్టి పెట్టాడు. త‌మ కుటుంబానికి మ‌నం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన విక్ర‌మ్ కే కుమార్ చేతిలో అఖిల్ ను పెట్టాడు నాగ్.

ఈ చిత్ర ఫైన‌ల్ షెడ్యూల్ ఇప్పుడు జ‌రుగుతుంది. మ‌రో 15 రోజుల్లో ఇది పూర్తి కానుంది. అనుకున్న‌ట్లుగానే న‌వంబ‌ర్ 15 లోపు విక్ర‌మ్ కుమార్ హ‌లో సినిమా పూర్తి చేయ‌నున్నాడు. ఇది యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. ఇందులో ఐదు యాక్ష‌న్ సీక్వెన్సులు క‌నిపించ‌బోతున్నాయి. వీటిని హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ రూపొందించాడు. మెట్రో రైల్ లో.. మెట్రో స్టేషన్ లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం 12 కోట్ల వరకూ ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇందులో అఖిల్ కు జోడీగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తోంది. అఖిల్ సినిమాకు అడ్డూ అదుపు లేకుండా 40 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి చేతులు కాల్చుకున్నాడు నితిన్. ఇప్పుడు నాగార్జున కూడా భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. కానీ నాగార్జున ఏం చేసినా ఆలోచించి చేస్తాడు కాబ‌ట్టి హ‌లోతో అఖిల్ కెరీర్ మార‌డం ఖాయం అంటున్నారంతా. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?