సైరాలో అమితాబ్ క్యారెక్టర్ ఏంటి?

Last Updated on by

సైరా సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానాలు. ఈ సినిమా అస‌లు పూర్త‌వుతుందా అని ఒక‌డు అంటే.. ఎవ‌రు ఉన్నారు.. ఎవ‌రెవ‌రు వెళ్తున్నారో అంటూ మ‌రొక‌రు అంటున్నారు. ఇలాంటి టైమ్ లో రోజూ ఈ సినిమాపై వ‌చ్చే వార్త‌లు చూస్తూ కిమ్మ‌న‌కుండా కామ్ గా ఉన్నాడు చిరంజీవి. ఇప్ప‌టికే సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వివ‌ర్మ‌న్ స్థానంలో ర‌త్న‌వేలు వ‌చ్చాడు.. రెహ‌మాన్ స్థానం ఇంకా భ‌ర్తీ కాలేదు. వీటితోనే టెన్ష‌న్ గా ఉంటే.. ఈ మ‌ధ్యే అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా సినిమా నుంచి వెళ్లిపోయాడంటూ వార్త‌లొచ్చాయి. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఓ పోస్ట్ పెట్టాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ముంబై వెళ్లి మెగాస్టార్ ను క‌లిసిన ఫోటో ఇప్పుడు నెట్ లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ ఫోటో చూసిన త‌ర్వాత బిగ్ బి ఉన్నాడా లేదా అని డౌట్ ప‌డిన వాళ్ల‌కు కావాల్సినంత క్లారిటీ వ‌చ్చేసింది. ముంబై వెళ్ల‌డ‌మే కాదు.. ఆయ‌న‌కు క‌థ చెప్పి.. ఎప్పుడు షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చి వ‌చ్చాడు సురేంద‌ర్ రెడ్డి.

రెండో షెడ్యూల్ లో అమితాబ్ రాక‌పోవ‌చ్చు. ఈయ‌న పాత్ర మూడో షెడ్యూల్ లో ఎంట‌ర్ అవుతుంది. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు అమితాబ్ బచ్చ‌న్. ఇందులో న‌ర‌సింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు అమితాబ్. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి ఎప్ప‌టిక‌ప్పుడు దారి చూపే పాత్ర ఇది. ఈ పాత్ర‌కు అమితాబ్ అయితేనే స‌రిగ్గా సూట్ అవుతాడ‌ని ఆయ‌న్నే లైన్ లోకి తీసుకొచ్చాడు చిరంజీవి. ఈ మెగాస్టార్ అడిగేస‌రికి ఆ మెగాస్టార్ కాద‌న‌లేక ఒప్పుకున్నాడు. మొత్తానికి అనుమానాలు అవ‌స‌రం లేదు.. సైరాలో అమితాబ్ బ‌చ్చ‌న్ ఉన్నాడ‌ని ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.

User Comments