ఇలియానాకు ఆప్ష‌న్ లేదు

Last Updated on by

దూరపు కొండ‌లు నునుపు అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. నిజంగానే ఇక్క‌డి నుంచి చూస్తే కొండ‌లు నునుపుగానే క‌నిపిస్తాయి. కానీ ద‌గ్గ‌రికి వెళ్తే కానీ తెలియ‌దు అక్క‌డ ఉన్న ఎత్తులు.. ప‌ల్లాలు. ఇప్పుడు ఇలియానా ప‌రిస్థితి కూడా ఇంతే. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమె టాప్ హీరోయిన్. ఇక్క‌డ కోటి తీసుకున్న తొలి తార‌. కోటితార‌గా టాలీవుడ్ లో చ‌రిత్ర‌కెక్కింది ఈ గోవాబ్యూటీ. స్టార్ హీరోల‌తో ఆఫ‌ర్లు.. అడిగినంత రెమ్యున‌రేష‌న్.. అన్నింటికీ అన్నీ ఉన్నా కూడా ఇవ‌న్నీ కాద‌నుకుని బాలీవుడ్ కు వెళ్లింది ఇలియానా. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత కానీ అర్థం కాలేదు అస‌లు సీన్. తొలి సినిమా బ‌ర్ఫీ  బాగానే ఆడినా కూడా ఆ క్రెడిట్ అంతా ర‌ణ్ బీర్ క‌పూర్, ప్రియాంక చోప్రా ప‌ట్టుకుపోయారు. ఆ త‌ర్వాత మై తేరా హీరోకు కూడా ప‌రిస్థితి ఇంతే. ఇక హ్యాపీఎండింగ్ తో ఇల్లీబేబీ కెరీర్ కు కూడా శుభం కార్డ్ ప‌డింద‌నుకున్నారంతా. కానీ అనుకోకుండా రుస్తోంతో ఆఫ‌ర్ ఇచ్చాడు అక్ష‌య్ కుమార్. అదేంటో కానీ ఆ సినిమాతో అక్ష‌య్ కు నేష‌నల్ అవార్డ్ వ‌చ్చినా ఇలియానాకు ఒరిగిందేం లేదు.
Will Ileana D'cruz success with Raid in Bollywood?
గ‌తేడాది అజ‌య్ దేవ్ గ‌న్ తో క‌లిసి బాద్ షాహోలో న‌టించింది ఇల్లీబేబీ. ఈ చిత్రంలో న్యూడ్ గా కూడా న‌టించింది. అంతేకాదు విద్యుత్ జ‌మాల్ తో క‌లిసి ముద్దుల్లోనూ మునిగితేలింది. ఇంత చేసినా కూడా గోవాబ్యూటీ జాత‌కం మార‌లేదు. ప్ర‌స్తుతం ఈమె రైడ్ సినిమాలో న‌టిస్తుంది. అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా ద‌ర్శ‌కుడు. 1981లో జ‌రిగిన వాస్త‌విక ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇన్ క‌మ్ ట్యాక్స్ ఆధారంగా ఈ చిత్రం వ‌స్తుంది. స్పెష‌ల్ 26లో దొంగ ఇన్ క‌మ్ ట్యాక్స్ అయితే..  ఇందులో మాత్రం రియ‌ల్ ఆఫీస‌ర్స్ అన్న‌మాట‌. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇందులో అజ‌య్ భార్య‌గా న‌టిస్తుంది ఇలియానా. ఈ చిత్రం ఒక్క‌టే ఇప్పుడు ఇలియానా ఆశ‌లు మోస్తుంది. మ‌రి.. రైడ్ తో ఈ గోవా భామ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు నెరవేరుతాయో..?

User Comments