ఏ హీరోకైనా దూకుడు ఒక్క సినిమాకు ఉంటుంది.. రెండు సినిమాలకు ఉంటుంది.. మహా అయితే మూడు సినిమాలకు ఉంటుంది. నాలుగో సినిమా అయినా కచ్చితంగా తేడా కొడుతుంది.. రెండేళ్లకు మళ్లీ జోరు తగ్గించి నెమ్మదిగా సినిమాలు చేస్తాడు. కానీ నాని మాత్రం దీనికి భిన్నం. ఈయన రచ్చ 2015లో మొదలైంది. ఇప్పటికీ ఆగడం లేదు. ఎవడే సుబ్రమణ్యంతో మొదలుపెట్టి.. భలేభలే మగాడివోయ్ తో 2015లో రెండు విజయాలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ.. జెంటిల్ మన్.. మజ్నుతో హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు 2017లోనూ ఇదే జోరు కంటిన్యూ చేస్తున్నాడు.
ఈ ఏడాది ఇప్పటికే రెండు విజయాలు.. మొత్తానికి ఏడు విజయాలు వరసగా అందించాడు న్యాచురల్ స్టార్. ఈయన కథ ఓకే చేస్తే అది హిట్టే. ప్రతీ సినిమాతో నెమ్మదిగా మొదలుపెట్టి.. ఆ తర్వాత మెల్లగా కలెక్షన్లు పెంచేస్తున్నాడు నాని. నేను లోకల్ తో ఏకంగా 35 కోట్ల మార్క్ అందుకున్న నాని.. నిన్నుకోరితో 29 కోట్లు వసూలు చేసాడు. నిన్నుకోరి సెట్స్ పై ఉన్నపుడే వేణు శ్రీరామ్ తో ఎంసిఎ సినిమా పట్టాలెక్కించేసాడు నాని. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తుంది. డిసెంబర్ లో క్రిస్ మస్ కానుకగా ఎంసిఏ విడుదల కానుంది. ఈ సినిమాతో 2017లో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు నాని.
ఇప్పటికే మేర్లపాకగాంధీతో కృష్ణార్జున యుద్ధం కూడా సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. గత నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి తిరుపతిలో మరోటి పారిస్ ఉండే పాత్ర.. కృష్ణ అర్జున్ మధ్య జరిగే సరదా కథే కృష్ణార్జున యుద్ధం. వచ్చే ఏడాది ఫిబ్రవరీలో కృష్ణార్జున యుద్ధం విడుదల కానుంది. ఆ లోపే అంటే.. జనవరిలోనే నాగార్జునతో మల్టీస్టారర్ మొదలు పెట్టనున్నాడు నాని. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించబోతున్నాడు. అశ్వినీదత్ నిర్మాత. ఇక ఇది పూర్తయ్యే లోపు కిషోర్ తిరుమల సినిమా సెట్ చేసాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే లో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. దీనికి చిత్రలహరి అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ఇది కాక హను రాఘవపూడితోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. ఇలా మొత్తానికి 2018 కూడా నాదే అంటున్నాడు నాని.