పవన్ ఆదుకొంటాడా.. గాలికి వేదిలేస్తాడా?

Last Updated on by

మంచోడే మంచోడే అంటే మంచ‌మెక్కి కంపు కంపు చేసాడంట వెన‌క‌టికి ఒక‌డు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ చేసింది కూడా ఇలాగే ఉంది. మ‌నోళ్లే క‌దా.. స్టార్స్ క‌దా.. ఎంతైనా పెట్టొచ్చు వాళ్లే వెన‌క్కి తెస్తారు క‌దా అని మార్కెట్ పై న‌మ్మ‌కంతో పెడితే నిండా ముంచేసారు ఈ జోడీ. సంక్రాంతి పండ‌క్కి వ‌చ్చిన అజ్ఞాత‌వాసి గురించి మ‌నం మాట్లాడుకునే బాధంతా. ఈ సినిమా ఫైన‌ల్ లెక్కలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. సినిమా వ‌చ్చి నెల రోజులు గ‌డిచిన త‌ర్వాత అన్నీ తిర‌గేస్తే అస‌లు లెక్క‌ల‌న్నీ బ‌య‌టికి వ‌చ్చాయి. ఇప్పుడు ఒక్కో బ‌య్య‌ర్ ఎంత మునిగాడు అని మెల్ల‌గా కూపీ లాగుతున్నారంతా. ఈ లెక్క‌ల్లో ఎక్కువ‌గా బొక్క ప‌డింది మాత్రం దిల్ రాజు.. ఆ త‌ర్వాత ఓవ‌ర్సీస్ అని తేలింది. తెలంగాణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపుగా అక్ష‌రాలా 29 కోట్ల‌కు తీసుకుంటే.. వ‌చ్చింది మాత్రం 10.50 కోట్లు మాత్ర‌మే. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా దాదాపుగా 26 కోట్లు వ‌స్తే కానీ సేఫ్ కాదు అనుకుంటే వ‌చ్చింది 7 కోట్లే.

డిజాస్ట‌ర్ టాక్ తోనే 57 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 98 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. మామూలు సినిమాల‌కైతే ఈ వ‌సూళ్లు వ‌స్తే పండ‌గ చేసుకుంటారేమో కానీ ప‌వ‌న్ కు కాదు. ఈ చిత్రం చేసిన బిజినెస్ అలా ఉంది మ‌రి. ఒక‌టా రెండా.. ఏకంగా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన మూడు సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. దీనికి ముందు స్పైడ‌ర్.. మెర్స‌ల్ ఉన్నాయి. ఆ అంచ‌నాలు అందుకున్న సినిమా మెర్స‌ల్ మాత్ర‌మే. ఈ చిత్రం 244 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది. స్పైడ‌ర్ ఎంత ముంచేసాడనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇకిప్పుడు ప‌వ‌న్ కూడా త‌న‌వంతుగా భారీగానే ముంచేసాడు. 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అక్ష‌రాలా 63 కోట్లు ముంచేసింది.

ప‌వ‌న్ 25వ సినిమా క‌దా అని కోట్లాది ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానుల ఆశ‌ల‌పై నిండా నీళ్లు పోసారు ప‌వ‌న్ అండ్ త్రివిక్ర‌మ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాస‌మే ఇప్పుడు అజ్ఞాత‌వాసి కొంప ముంచేసిందేమో అనిపిస్తుంది కాస్త లోతుగా జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే..! ఈ పాపం ఎవ‌రిది అయినా కానీ ఇప్పుడు మునిగేది మాత్రం బ‌య్య‌ర్లే. ఈ చిత్రం ఫైన‌ల్ రన్ 57 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. అంటే నిక‌రంగా 63 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. మ‌రి ఈ న‌ష్టాల‌ను ఎవ‌రు భ‌రిస్తారు..? ప‌వ‌న్ కానీ.. త్రివిక్ర‌మ్ కానీ త‌మ డ‌బ్బుల‌ను వెనక్కిస్తారా.. లేదంటే అంత రేట్ పెట్టి ఎవ‌డు కొన‌మన్నాడు అంటూ గాలికి వ‌దిలేస్తారా.. ఇప్ప‌టికైతే సినిమాను న‌మ్మి అడ్డంగా మునిగిపోయారు కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లు.

User Comments