వచ్చే జాతీయ అవార్డు సుక్కూదే?

Last Updated on by

65వ జాతీయ అవార్డుల స‌ర‌ళి ప‌రిశీలిస్తే, అవార్డులు గెలుచుకున్న సినిమాల స‌ర‌ళిని నిశితంగా చూస్తే, మ‌నం కూడా జాతీయ అవార్డుల కేట‌గిరీలో ముంద‌డుగు వేస్తున్నామ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఈసారి బాహుబ‌లి-2, ఘాజి చిత్రాలు తెలుగువారికి జాతీయ అవార్డుల్ని అందించాయి. ది గ్రేట్ రాజ‌మౌళి, సంక‌ల్ప్ రెడ్డిల‌ను ప్ర‌శంసించి తీరాలి. కేవ‌లం ప్ర‌శంసిస్తే స‌రిపోతుందా… ఇలాంటి ప్ర‌యోగాలు చేసిన ఆ ఇద్ద‌రినీ ప్ర‌భుత్వాలు, టాలీవుడ్ విడివిడిగా ప్ర‌త్యేక వేదిక‌పై స‌న్మానించాలి.

అయితే ఇదే సంద‌ర్భంలో 2018-19 సీజ‌న్‌కి జాతీయ అవార్డు అందుకునే స‌త్తా ఉన్న సినిమా ఇంత‌వ‌ర‌కూ ఏం వ‌చ్చింది తెలుగులో అన్న‌ది ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌రంగా ఆ అర్హ‌త సాధించే సినిమా ఇప్ప‌టికే రిలీజైంద‌ని అవ‌గ‌త‌మ‌వుతోంది. ఈ ఏడాది అందించిన జాతీయ అవార్డుల్లో నేటివిటీతో స‌హ‌జ‌సిద్ధ‌మైన‌ సినిమా తీసిన అస్సామీ సినిమా `విలేజ్ రాక్‌స్టార్‌`కు ఏకంగా ఐదు జాతీయ అవార్డులు ద‌క్కాయి. అవి ఏఏ విభాగాలు అన్న‌ది అటుంచితే, సేమ్ టు సేమ్ బాణీలో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం`కు జాతీయ అవార్డులు ద‌క్కే ఆస్కారం ఉంద‌నే భావించ‌వ‌చ్చు. క‌మ‌ర్షియాలిటీ ఉన్నా, స‌న్నివేశాల్లో, ఎంచుకున్న క‌థాంశం ఎత్తుగ‌డ‌లో స‌హ‌జ‌సిద్ధ‌త‌కు ప్రాధాన్య‌త‌నిచ్చాడు సుక్కూ. గోదారి యాస‌, సంస్కృతి, ప్ర‌జాజీవ‌నాన్ని గోదారి జిల్లాల్లో ఎలా ఉంటుందో అలా అచ్చంగా.. య‌థాత‌థంగా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో 200శాతం విజ‌యం సాధించాడు. డ‌బ్బు రాబ‌డుతూనే ప్ర‌జ‌ల సంస్కృతి-సాంప్ర‌దాయాల్ని, పాత్ర‌ల ఔచిత్యాన్ని సినిమాలో చూపించిన వైనం న‌భూతోన‌భ‌విష్య‌తి. అందుకే `రంగ‌స్థలం` అవార్డుల సినిమా అన్న టాక్ కూడా ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది. ద‌ర్శ‌కుడు సుకుమార్ ప‌నితనానికి వ‌చ్చే జాతీయ అవార్డుల్లో గుర్తింపు ద‌క్కాలి.. అన్న చ‌ర్చా సాగుతోంది. ఒక‌వేళ మ‌నోడికి రాదా? ఇచ్చేందుకు ఈగో అడ్డంకి కాదు క‌దా? అంటూ మాట్లాడుకుంటున్నారు.ఈసారి 65వ జాతీయ అవార్డుల్లో సంక‌ల్ప్‌, రాజ‌మౌళి వెలుగులు ప్ర‌స‌రించారు. నెక్ట్స్ 66వ జాతీయ అవార్డుల్లో సుకుమార్ పేరు ఉంటుంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. చూద్దాం.. అవార్డుల బ‌రిలో `రంగ‌స్థ‌లం` సినిమా నిలుస్తుందా? నిలవ‌దా? ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప‌నిత‌నానికి గుర్తింపు ద‌క్కుతుందా? లేదా? పుర‌స్కారాల‌కు ఈ సినిమా వెళుతోందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

User Comments