సొమ్ము కావాలి.. ఇవ్వకపోతే తిట్టాలి

ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు బ‌య‌ట సామాన్య జ‌నంలో కూడా వ‌స్తున్న అనుమానం ఇదే. అస‌లు న్యూస్ ఛానెల్స్ లో సినిమా ప్రోగ్రామ్స్ ఎందుకు..? మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు వాళ్లనెందుకు న‌మ్ముకోవాలి..? న‌్యూస్ ఛానెల్స్ లేక‌పోతే సినిమా బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేదా..? ఇన్ని ఎంట‌ర్ టైన్మెంట్ ఛానెల్స్ ఉన్నాయి క‌దా అలాంట‌ప్పుడు న్యూస్ ఛానెల్స్ తో ఇంకా ప‌నేంటి అని నిర్మాత‌ల‌కు అనుమానాలు వ‌స్తున్నాయి. పైగా బోలెడ‌న్ని వెబ్ సైట్లు ఎలాగూ ఉన్నాయి క‌దా.. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా న్యూస్ ఛానెల్స్ కోసం పాకులాడ‌టం అన‌వ‌స‌రం అనే భావన ఇండ‌స్ట్రీలోనూ వినిపిస్తుంది. అస‌లు న్యూస్ ఛానెల్స్ వ‌ల్ల సినిమాలు బ‌తుకుతున్నాయా.. సినిమాల వ‌ల్ల న్యూస్ ఛానెల్స్ బ‌తుకుతున్నాయా..? అంటే ఈ ప్ర‌శ్న‌కు సమాధానం న్యూస్ ఛానెల్సే సినిమాల వ‌ల్ల బ‌తుకుతున్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది. వాళ్ళ‌తోనే యాడ్స్ తీసుకుంటూ.. వాళ్ల‌పైనే నెగిటివ్ ప్ర‌చారం చేస్తుంటారని కొందరు బాహాటంగానే న్యూస్ ఛానెల్స్ ను దెప్పి పొడుస్తున్నారు.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తోన్న పోరాటం కూడా ఇదే. మ‌న సొమ్ము తింటూ మ‌న‌ల్నే తిట్టే ఛానెల్స్ ను ఎందుకు ఇండ‌స్ట్రీ ప్రోత్సహించాలి.. అవ‌స‌రం లేదు బ్యాన్ చేయండంటూ ప‌వ‌న్ కోరుతున్నాడు. కేవ‌లం ఎంట‌ర్ టైన్మెంట్ ఛానెల్స్ కు మాత్ర‌మే యాడ్స్ ఇస్తూ.. అందులోనే సినిమా ప్ర‌మోష‌న్ చేసుకొని.. ఇంకొన్ని వెబ్ సైట్ సోషల్ మీడియా వాళ్ళతో టైఅప్ అయితే ఎలా ఉంటుందని ఇండ‌స్ట్రీలోని కొందరు పెద్ద‌లు చర్చలు జ‌రుపుతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. కానీ ఇది నిజంగా వ‌ర్కువ‌ట్ అయ్యే ప‌నేనా అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే న్యూస్ ఛానెల్స్ తో ద‌ర్శ‌క నిర్మాత‌ల బంధం కూడా బాగా ముడిప‌డిపోయింది. ఇప్ప‌టికిప్పుడు వాళ్లు ఆ బంధాన్ని తెంపుకోవ‌డం క‌ష్టం. కానీ తెంపుకోవాలంటే కూడా తేలికే. ఎందుకంటే అది వాళ్ల చేతుల్లోనే ఉంది. కానీ దీనికి ద‌ర్శ‌క నిర్మాత‌లంతా ఒప్పుకుంటారా అనేది మాత్రం ఖచ్చితంగా అనుమాన‌మే. ఛానెల్స్ త‌మ ప‌బ్బం గ‌డుపుకోవ‌డం కోసం ఇండ‌స్ట్రీని టార్గెట్ చేస్తుంటే.. వాళ్ల‌నెందుకు స‌పోర్ట్ చేయాల‌ని కొంద‌రు అడుగుతుంటే.. న్యూస్ ఛానెల్స్ లేకుండా సినిమా ఎలా బ‌తుకుతుంద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం చివ‌రికి ఎక్క‌డ తెగుతుందో..?