కేజీఎఫ్ 50రోజుల్లో 250కోట్లు

Last Updated on by

సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ను బాహుబ‌లి ముందు.. బాహుబ‌లి త‌ర్వాత అని విశ్లేషించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఉత్త‌రాదిపై ద‌క్షిణాది దండ‌యాత్ర సాగుతోంది. మ‌న సినిమాల్ని ఉత్త‌రాది వాళ్లు రీమేక్ లు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. మ‌న వాళ్లు ఎంచుకునే క‌థ‌ల్లో పెప్ అక్క‌డ విప‌రీతంగా న‌చ్చుతోంది. బాలీవుడ్ ఎంతో ఎత్తున ఉన్నా.. ఎందుక‌నో సౌత్ ముందు చ‌తికిల‌బ‌డ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒకే ఒక్క బాహుబ‌లి తెచ్చిన మార్పు ఇది. బాహుబ‌లి1, బాహుబ‌లి 2 చిత్రాలు హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద బంతాడేశాయి. ఈ రెండు సినిమాలు క‌లిపి ఏకంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2400 కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో చ‌ర్చించుకుంటున్న సినిమా ఏది? అంటే క‌న్న‌డ‌ రాక్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీఎఫ్ గురించి అంత‌గా మాట్లాడుకుంటున్నారు. బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌మోట్ చేసిన ఈ సినిమా అటు ఉత్త‌రాదినా బంప‌ర్ హిట్ కొట్టింది. అక్క‌డ ఏకంగా 44కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. కేవ‌లం క‌ర్నాట‌క‌లో ఈ చిత్రం 137 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు తిర‌గ‌రాసింది. అక్క‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ సినిమాల‌కే అంత సీను లేద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇక య‌శ్ ఒక డ్రైవ‌ర్ కొడుకు అయ్యి ఉండీ ఈ స్థాయిని అందుకోవ‌డంపైనా స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే కేజీఎఫ్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజుల్లో దాదాపు 243కోట్లు వ‌సూలు చేసింది. మ‌రికొద్దిరోజుల్లో 250 కోట్ల వ‌సూళ్ల‌ను అందుకుంటుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ ఉత్సాహంలోనే య‌శ్ హీరోగా ద‌ర్శ‌కుడు నీల్ కేజీఎఫ్- ఛాప్ట‌ర్ 2 తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో మున్నాభాయ్ సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టిస్తార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. పార్ట్ 2తో ఇటు ద‌క్షిణాది, అటు ఉత్త‌రాది రెండు చోట్లా సంచ‌ల‌న విజ‌యం సాధించాల‌న్న‌ది ప్లాన్. అందుకోసం బాహుబ‌లి 2 స్ట్రాట‌జీని అనుస‌రించాల‌ని య‌శ్ & టీమ్ భావిస్తున్నార‌ట‌. బాహుబ‌లి త‌ర్వాత ఆ స్ఫూర్తితో సౌత్ హ‌వాకి ఇది నిద‌ర్శ‌నం అని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

User Comments