`యాత్ర‌`తో కింగ్ మైత్రి బంధం

వైయస్సార్ పార్టీతో కింగ్ నాగార్జున అనుబంధం గురించి తెలిసిందే. రాజకీయాల్లో నాగార్జున ప్రత్యక్షంగా లేకపోయినా వైకాపా అంటే ఆయన అభిమానం చూపిస్తుంటారు. ఆ పార్టీ నాయకులతోనూ చక్కని అనుంబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం వైయస్సార్ జీవితంలోని కీలక ఘట్టమైన పాద యాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న `యాత్ర` ఫిబ్రవరి 8న రిలీజ్ కి రెడీ అవుతోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేం మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రచారంలో భాగంగా బీచ్ సొగసుల విశాఖ నగరంలో `యాత్ర` ఈవెంట్ జరిగిన సంగతి తెలిసింద. ఊక వేస్తే రాలనంత మంది అభిమానులు ఈ వేడుకకు విచ్చేసారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ (హైదరాబాద్ ) లో Feb 1 `యాత్ర` ప్రీరిలీజ్ వేడుకకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వైయస్ – జగన్ ద్వయానికి నాగార్జున అభిమాని. ఆ క్రమంలోనే ఈ ఏర్పాట్లపై ఆసక్తికర చర్చ సాగుతోంది. యాత్ర నిర్మాతలు కింగ్ నాగార్జునకు సన్నిహితులు అని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ లో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా పాల్గొంటారట. యాత్ర చిత్రం గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడింది. జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా థియేటర్ల సమస్యతో రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఫిబ్రవరిలో అన్ని అంకాల్ని దాటుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వైయస్సార్ అభిమానుల్లో .. వైయస్ కుటుంబ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బయోపిక్ ల ట్రెండ్ లో ఇటీవల రిలీజైన ఎన్టీఆర్ బయోపిక్ – కథానాయకుడు ఫెయిల్యూర్ నేపథ్యంలో `యాత్ర` ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో అంటూ ఆసక్తి గా వేచి చూస్తున్నారంతా. సావిత్రి బయోపిక్ మహానటి రిజల్ట్ ని ప్రతిబింబించడంలో యాత్ర సఫలమవుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.