సీఎం జ‌గ‌న్ కి యాత్ర సీక్వెల్ గిఫ్ట్

డా.వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర నేప‌థ్యంలో `యాత్ర` రిలీజైన‌ సంగ‌తి తెలిసిందే. మ‌హి.వి.రాఘ‌వ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. విజ‌య్ చిల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. అయితే దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న తాజాగా వెలువడింది. ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ ప్ర‌క‌టించి బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

ఎన్నిక‌ల‌ రిజ‌ల్ట్ ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఓవైపు వైయ‌స్సార్ రాజ‌కీయ వార‌సుడు వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్ప‌ష్ట‌మైన మెజారిటీతో గెలిచి సీఎం అవుతున్న త‌రుణంలో మ‌హి.వి.రాఘ‌వ్ ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇంత‌కీ ఈసారి సీక్వెల్ కోసం ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకోబోతున్నారు? అంటే.. ఈ సీక్వెల్ వైయ‌స్ జ‌గ‌న్ డేరింగ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ చుట్టూ తిరుగుతుంద‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న వైయ‌స్సార్ మ‌ర‌ణానంత‌రం.. ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఎలాంటి స‌న్నివేశం ఎదురైనా మొండివాడిగా ఏటికి ఎదురీదుతూ జ‌గ‌న్ త‌న‌ ప్ర‌త్య‌ర్థుల‌పై అలుపెర‌గ‌ని పోరాటం సాగించారు. త‌న‌ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర జ‌రిగింద‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న వాద‌న‌ను వినిపించారు. వైయ‌స్సార్ మ‌ర‌ణానంత‌రం త‌న లైఫ్ లో ఎన్నో కాంప్లికేష‌న్ల‌ను ప్ర‌త్య‌ర్థులు సృష్టించారు. త‌న‌ని .. త‌న కుటుంబాన్ని ప్ర‌త్య‌ర్థులు ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేశారు? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అన్న పాయింట్ తో ఈ సీక్వెల్ క‌థాంశం ఉంటుంద‌ని తెలుస్తోంది. వైయ‌స్సార్ కాంగ్రెస్ అధినాయ‌కుడిగా వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర మొదలు 2019 ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వచ్చే వరకు చోటు చేసుకున్న పరిణామాలపై ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్ ప్లేతో ఈ సీక్వెల్ ని రక్తి క‌ట్టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఓవైపు తెలుగు దేశం పార్టీ పై వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి.. వైయ‌స్ జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెర‌గ‌డానికి దారి తీసిన ప‌రిస్థితుల్ని ఈ చిత్రంలో ప్ర‌స్థావిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. “యాత్రా 2` క‌థ రాయ‌డం మొద‌లు పెడుతున్నా. త్వరలోనే సినిమా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను“ అంటూ ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ ప్ర‌క‌టించారు. సంపూర్ణ వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.