ప్ర‌భాస్ సినిమా… ఓ ప్ర‌పంచం

బాహుబ‌లి సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే ప్ర‌భాస్ రెండు క‌థల్ని ఓకే చేశాడు. అందులో ఒక‌టి సాహో, మ‌రొక‌టి రాధాకృష్ణ‌కుమార్ త‌యారు చేసిన క‌థ‌. ఈ రెండు సినిమాల గురించి బోలెడంత మాట్లాడుకున్నారు జ‌నాలు. అందులో ఒక‌టి సాహో వ‌చ్చి వెళ్లింది. ఇక రెండో సినిమా ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. `జాన్‌` అనే పేరు కూడా ప్ర‌చారంలో ఉంది. ఈ సినిమా క‌థ ఇలా ఉంటుందట‌, అలా ఉంటుంద‌ట అంటూ యేళ్ల త‌ర‌బ‌డి మాట్లాడుకుంటున్నాం. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే ఒక పీరియాడిక‌ల్ స్టోరీ అనే మాట మొద‌ట్నుంచీ వినిపిస్తూనే ఉంది. పీరియాడికల్ క‌థంటే ప్ర‌భాస్ ఎలా క‌నిపిస్తాడు?

ఈ సినిమా ఎలా ఉంటుంది? అనే ప్ర‌శ్న‌లు ఎప్ప‌ట్నుంచో ప్రేక్ష‌కుల్ని వెంటాడుతున్నాయి. దానిపై ద‌ర్శ‌కుడు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ… “అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా ఇదేం పీరియాడిక‌ల్ సినిమా కాదు. ఈ క‌థ ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచంలో సాగుతుంది. అదెలా ఉంటుంద‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్‌“ అని చెప్పుకొచ్చాడు. `బాహుబ‌లి` కూడా ప్ర‌త్యేకమైన ఒక ప్ర‌పంచంలో సాగిన క‌థే. ఆ చిత్రం కోసం రాజ‌మౌళి మ‌హిష్మతిని సృష్టించాడు. మ‌రి రాధాకృష్ణ‌కుమార్ సృష్టిస్తున్న ప్ర‌పంచం ఎలా ఉంటుంద‌న్న‌దే ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.