సీజ‌న్ 4 కోసం యంగ్ టైగ‌ర్?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ తొలి సీజన్ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలిసిందే.  వివాదంతో ప్ర‌చారం అవ‌స‌రం లేకుండా స‌క్సెస్ సాధించి చూపించారు తార‌క్. కంటెస్టెంట్లతో ఎన్టీఆర్    వైఖ‌రి, త‌న‌  ఇమేజ్, ఐడియాల‌జీ,  నిర్ణ‌యాలు గేమ్ ను విజ‌య‌వంతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాయి. అందుకే సీజ‌న్ -1 అంత పెద్ద స‌క్సెస్ అయింది. దీంతో నిర్వాహ‌కులు సీజ‌న్-2ని అంత‌కు మించి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని భావించారు. అయితే తార‌క్ రేంజు ఛ‌రిష్మా ఉన్న స్టార్ అందుబాటులో లేక‌పోవ‌డంతో నేచుర‌ల్ స్టార్ నానీని రంగంలోకి దించారు. కానీ సీజన్-2 అంతా వివాదాలు, గంద‌ర‌గోళం న‌డుమ‌ ముంగించాల్సి వ‌చ్చింది.

హోస్ట్ గా నాని ఆక‌ట్టుకున్నా.. వివాదాలు ఇబ్బంది పెట్టాయి. టీఆర్పీ నిరుత్సాహ‌ప‌ర‌చ‌డం ఇబ్బందిక‌రం అయ్యింది. ఆ క్ర‌మంలోనే సీజ‌న్-3 కోసం ఎన్టీఆర్ నే తిరిగి తేవాల‌నుకున్నా సాధ్య‌ప‌డ‌లేదు. తార‌క్ బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల కుద‌ర‌లేదు. దీంతో ఆ స్థానంలో కింగ్ నాగార్జున‌ను ఎంచుకుని సీజ‌న్-3ని ముగించిన సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 3కి ఫ‌ర్వాలేద‌నిపించే ఆద‌ర‌ణ ద‌క్కింది. అయితే సీజ‌న్ 4ని మ‌రింత బెట‌ర్ గా స‌క్సెస్ చేసేందుకు స్టార్ మా బృందం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. సీజ‌న్-4 కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నం మొద‌లైంద‌ట‌. ఎంత పారితోషికం  ఇవ్వ‌డానికైనా రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈసారి ఆఫ‌ర్ కి తార‌క్ ఎస్ చెబుతాడా లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం తార‌క్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.