వైఎస్ఆర్ పాద‌యాత్ర మొద‌లైంది

Last Updated on by

అవును.. ఓ వైపు వైఎస్ఆర్ త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తున్నారు. ఈయ‌న కొన్ని నెల‌లుగా ఎండ‌ల్లోనే చెప్పులు అరిగిపోయేలా పాద యాత్ర చేస్తున్నాడు. అప్ప‌ట్లో తండ్రి న‌మ్మిన సిద్ధాంతాల‌నే ఇప్పుడు జ‌గ‌న్ కూడా న‌మ్ముతున్నాడు. ఇక ఇప్పుడు త‌న‌యుడితో పాటు మ‌ళ్లీ తండ్రి పాద యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. వైఎస్ఆర్ బ‌యోపిక్ షూటింగ్ మొద‌లైంది. పాద‌యాత్రే ప్ర‌ధాన క‌థ‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ మెగాస్టార్ మ‌మ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తెలుగు నాట ఎన్టీఆర్ త‌ర్వాత అంత‌టి మాస్ లీడ‌ర్ గా వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డికి ఇమేజ్ ఉంది. రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.. చాలా అలిగేష‌న్స్ ఉన్నాయి కానీ చ‌నిపోయిన వ్య‌క్తి గురించి ఇప్పుడు అవ‌న్నీ మాట్లాడ‌టం స‌రికాదు.

గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మ లాంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మ‌హి వి రాఘ‌వ ఇప్పుడు వైఎస్ఆర్ బ‌యోపిక్ చేస్తున్నాడు. వైఎస్ చ‌నిపోయి 9 ఏళ్లు అవుతున్నా ప్ర‌జ‌ల గుండెల్లో అంతులేని అభిమానం అయితే ఉంది. ఈ రోజుల్లో ఓ లెజెండ్ క‌న్నుమూస్తే వెంట‌నే బ‌యోపిక్ తీస్తున్నారు. కానీ కార‌ణం తెలియ‌దు కానీ వైఎస్ చ‌నిపోయి 9 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఆయ‌న జీవితంపై ఎవ‌రూ సినిమా చేయ‌లేదు. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే సినిమాను పూరీ అనౌన్స్ చేసాడు. రాజ‌శేఖ‌ర్ ఇందులో హీరోగా న‌టించాల‌ని ఫిక్స‌య్యాడు కూడా. కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ సినిమా ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వైఎస్ఆర్ బ‌యోపిక్ సెట్స్ పైకి వ‌చ్చింది. మ‌మ్ముట్టిని ఒప్పించి ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తున్నాడు మ‌హి వి రాఘ‌వ‌. మ‌రి.. వైఎస్ బ‌యోపిక్ ఎలా ఉండ‌బోతుందో..? ఎన్నిక‌ల ముందు ఈ చిత్రం విడుద‌ల కానుంది.

User Comments